మేడారం జాతర సమ్మక్క సారక్కల గద్దెల వద్ద నిలువెత్తు బంగారం(బెల్లం) సమర్పించే భక్తులు ఎంతో పవిత్రమైన కార్యంగా భావిస్తారని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. జాతరకు వెళ్ళలేని భక్తులు తమ నిలువెత్తు బంగారం అమ్మవారి గద్దెల వద్ద సమర్పించే సేవలను సచివాలయంలోని తన కార్యాలయంలో ప్రారంభించారు. తన మనవడు కొండా మురళీకృష్ణ పేరును మీ సేవ వెబ్‌సైట్‌లో నమోదు చేసి, బరువు ప్రకారం డబ్బులు చెల్లించి అమ్మవారి గద్దెల వద్ద నిలువెత్తు బంగారం సమర్పించే సౌకర్యాన్ని పొందారు. వివిధ కారణాలతో సమ్మక్క సారాలమ్మలను దర్శించుకోలేని భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
ఐటి శాఖ సహకారంతో దేవాదాయ శాఖ అమలు చేస్తున్న ఈ సేవలు నేటి నుంచే ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. మీ సేవ, టి యాప్ ఫోలియో, పోస్టల్ డిపార్ట్‌మెంట్ ద్వారా ఎవరి పేరు మీద బంగారం సమర్పించాల నుకుంటురో వారి బరువును అనుసరించి డబ్బులు చెల్లించి ఈ సేవలను బుక్ చేసుకునే వెసులుబాటును దేవాదాయ శాఖ అందిస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని దాదాపు 5 వేల మీ సేవా సెంటర్లు, దేశంలోని దాదాపు 1.5 లక్షల పోస్టల్ కేంద్రాలు (తెలంగాణలో 6 వేల కేంద్రాలు) ఈ సేవలను అందిస్తాయి. దేవాదాయ శాఖ సంవత్సరం పొడవునా బంగారం సమర్పణ సేవలను అందిస్తుందన్నారు.
బంగారం సమర్పణతో పాటు, అమ్మవారి ప్రసాదం కావాలనుకునే వారు కూడా పోస్టల్ డిపార్ట్ మెంట్, టి యాప్, మీ సేవా కేంద్రాల ద్వారా డబ్బులు చెల్లిస్తే, పోస్టల్ శాఖ కొరియర్ ద్వారా వారికి ప్రసాదాన్ని అందిస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, పలువురు దేవాదాయ శాఖ అధికారులు, పోస్టల్ డిపార్ట్ మెంట్, మీ సేవ అధికారులు తదితరులు పాల్గొన్నారు.