అమెరికాలో చట్టబద్ధమైన, చట్ట విరుద్ధమైన విదేశీ జనాభా అక్టోబర్ 2023లో 49.5 మిలియన్‌లుగా నమోదైంది. అయితే అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ 2021లో బాధ్యతలు స్వీకరించిన తర్వాత రికార్డు స్థాయిలో 45 లక్షల విదేశీ జనాభా పెరిగినట్టు నిర్వహించిన ఒక సర్వే వెల్లడించింది. అలాగే అమెరికా చరిత్రలో ఎన్నడూ లేనంతగా మొత్తం దేశ జనాభాలో 15 శాతం విదేశీయులు, వలస వచ్చిన వారేనని 2023 అక్టోబర్ వరకు నిర్వహించిన ఈ సర్వే తెలియజేసింది. ఇప్పటికే దేశంలోకి వస్తున్న అక్రమ వలసదారులపై చర్చ జరుగుతున్న క్రమంలో దేశంలో ఉన్న 25 రాష్ర్టాల జనాభా కన్నా 45 లక్షల వలసదారుల పెరుగుదల ఆందోళన కలిగించే అంశమని ఆ సర్వే పేర్కొంది.
