అధ్యక్ష ఎన్నికలతో అమెరికాలో రాజకీయాలు వేడెక్కాయి. డెమోక్రాట్స్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ కొనసాగుతోంది. గెలుపే లక్ష్యంగా ఇద్దరు అభ్యర్థులూ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. భారత మూలాలున్న అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ క్రమంలో దేశీ టచ్‌తో దక్షిణాసియా ఓటర్లను ఆకట్టుకునేందుకు కమలా హారిస్ వినూత్నంగా ముందుకెళ్తున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2024/09/50e409c6-592a-4e9f-922f-2a94141522d8-44.jpg)
ఇందులో భాగంగానే భారత్‌కు ఆస్కార్ అవార్డు తెచ్చిపెట్టిన ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటతో కమలా దూసుకెళ్తున్నారు. ఈ పాటను స్ఫూర్తిగా భారత – అమెరికన్ లీడర్ అజయ్ భుటోరియా నాచో నాచో పేరుతో హిందీ గీతాన్ని విడుదల చేశారు. ఉపాధ్యక్షురాలి ప్రచార కార్యక్రమాల చిత్రాల సమూహారంతో ఈ పాటను ప్రత్యేకంగా రూపొందించి విడుదల చేశారు. ప్రస్తుతం ఈ నాచో నాచో పాట అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో అందరినీ ఆకట్టుకుంటోంది. నాచో నాచో కేవలం పాట కాదని ఈ సందర్భంగా అజయ్ భుటోరి యా తెలిపారు. అది ఓ ఉద్యమంగా అభివర్ణించారు. దక్షిణాసియా అమెరికన్ కమ్యూనిటీతో అనుసంధానం కావడమే మా ప్రచారం లక్ష్యమని ఈ సందర్భంగా వెల్లడించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2024/09/f8900b5f-232d-4ed0-9e9a-f342ae9bc1c6-42.jpg)