అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భావోద్వేగానికి గురయ్యారు. నిండు సభలో కన్నీరు పెట్టుకున్నారు. చికాగో లో జరిగిన డెమోక్రాటిక్ పార్టీ జాతీయ సదస్సులో ఈ పరిణామం చోటు చేసుకుంది.పార్టీ కన్వెన్షన్‌కు బైడెన్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వేదికపైకి రాగానే బైడెన్‌ను ఉద్దేశించి ఆయన కుమార్తె యాష్లీ బైడెన్ మాట్లాడుతూ తన తండ్రి ఆడపిల్లల పక్షపాతి అని చెప్పారు. మహిళలకు ఆయన విలువనివ్వడం, వారిని నమ్మడం తాను చూశానని తెలిపారు. కుమార్తె మాటలతో బైడెన్ ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి గురై, కంటతడి పెట్టుకున్నారు. వెంటనే పక్కకు తిరిగి కన్నీళ్లు తుడుచుకున్నారు.
అనంతరం అమెరికా ఐ లవ్యూ అంటూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగాన్ని ప్రారంభించారు. అమెరికా రాజకీ యాల్లో హింసకు తావు లేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. డొనాల్డ్ ట్రంప్ పై బైడెన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అమెరికా గౌరవం చాలా ముఖ్యం. ఈ దేశంలో విద్వేశానికి చోటు లేదు. ట్రంప్ ప్రభుత్వంలో ఇక్కడ ఎలాంటి అభివృద్ధీ జరగలేదు.
మంచి మౌలిక వసతులు లేకపోతే అత్యుత్తమ ఆర్థిక వ్యవస్థగా ఎలా నిలవగలం? ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న ప్పుడు ప్రతి వారం మౌలిక వనరులపై వాగ్దానాలు చేస్తూ వెళ్లారు. కానీ, ఒక్క పని కూడా పూర్తి చేయలేదు. మన ప్రభుత్వ హయాంలో మాత్రం ఎయిర్ పోర్టులు, పోర్టులు, రైళ్లు, రోడ్లు, వంతెనలు, బస్సులను ఆధునికీకరిం చాం. హైస్పీడ్ నెట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం. దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చాం. ఆర్థిక వ్యవస్థ వృద్ధికి కృషి చేశాం అని తెలిపారు. గత 50 ఏళ్లుగా అమెరికాకు అత్యుత్తమ సేవలను అందించానని ఈ సందర్భంగా బైడెన్ తెలిపారు. దీనికి ప్రతిఫలంగా లక్షల రెట్ల అభిమానం అమెరికన్ల నుంచి తనకు లభించిందని సంతోషం వ్యక్తం చేశారు.