కెనడాలోని భారత దౌత్యాధికారులపై ఆడియో, వీడియో నిఘా పెట్టినట్లు పార్లమెంటుకు కేంద్ర ప్రభుత్వం చెప్పింది. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానం చెప్తూ, కెనడాలోని వాంకోవర్లో ఉన్న మన దేశ దౌత్యాధికారులపై ఆ దేశం ఆడియో, వీడియో నిఘా పెట్టిందని తెలిపారు. ఈ విషయాన్ని ఆ దేశ అధికారులు మన దేశ దౌత్యవేత్తలకు చెప్పారన్నారు. ప్రైవేట్ కమ్యూనికేష న్స్ను కూడా అడ్డుకుని, పరిశీలిస్తున్నట్లు తెలిపారన్నారు. దీంతో మన దేశంలోని కెనడా హై కమిషన్కు ఈ నెల 2న నిరసన తెలిపామని చెప్పారు. కెనడా చర్యలు అన్ని దౌత్య నిబంధనలను ఉల్లంఘించడమేనని తెలిపారు. కెనడాలోని మనదేశ దౌత్యవేత్తలు ఇప్పటికే తీవ్రవాదం, హింసాత్మక వాతావరణంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్నారు. సాంకేతిక అంశాలను సాకుగా చూపించి ఈ వాస్తవాన్ని కెనడా సమర్థించుకోజాలదని పేర్కొన్నారు.