ఆస్కార్స్ రేసు నుంచి హిందీ చిత్రం లాపతా లేడీస్ ఔటైంది. 97వ అకాడమీ అవార్డుల కోసం భారత్ నుంచి బెస్ట్ ఇంటర్నేషన్ ఫీచర్ క్యాటగిరీలో ఎంట్రీ ఇచ్చిన ఆ సినిమా తుది జాబితా నుంచి తప్పుకున్నది. కిరణ్ రావు డైరెక్షన్ చేసిన ఈ ఫిల్మ్‌కు ఆస్కార్స్ షార్ట్‌లిస్టులో చోటు దక్కలేదు. 15 చిత్రాల షార్ట్‌లిస్టు నుంచి అయిదింటిని తుది రేసుకు ఎంపిక చేస్తారు. అయితే 15 చిత్రాల లిస్టును అకాడమీ ప్రకటించింది. లాపతా లేడీస్ ఆ లిస్టులో లేకున్నా, ఇండియా కు చెందిన ఫిల్మ్‌మేకర్ సంధ్యా సూరి తీసిన సంతోష్ అనే చిత్రానికి షార్ట్‌లిస్టులో చోటు దక్కింది. ఈ ఫిల్మ్‌లో ఇండియన్ స్టార్స్ షాహనా గోస్వామి, సునితా రాజ్వార్ నటించారు. అయితే ఈ ఫిల్మ్ యూకే తరపున ఆస్కార్స్‌కు ఎంట్రీ ఇచ్చింది.
ఎమిలియా పెరిజ్(ఫ్రాన్స్), ఐయామ్ స్టిల్ హియర్(బ్రెజిల్), యునివర్సల్ ల్యాంగ్వేజ్(కెనడా), వేవ్స్(చెక్ రిపబ్లిక్), ద గర్ల్ విత్ ద నీడిల్(డెన్మార్క్), ద సీడ్ ఆప్ ద సాక్రెడ్ ఫిగ్(జర్మనీ), టచ్(ఐస్‌ల్యాండ్), నీక్యాప్(ఐర్లాండ్), వెర్మిగ్లో (ఇటలీ), ఫ్లో(లత్వియా), ఆర్మండ్(నార్వే), ఫ్రమ్ గ్రౌండ్ జీరో(పాలస్తీనా), దహోమే(సెనిగల్), హౌ టు మేక్ మిలియన్స్ బిఫోర్ గ్రాండ్‌మా డైస్(థాయిలాండ్) చిత్రాలు ఇంటర్నేషనల్ ఫీచర్ కేటగిరీలో పోటీపడుతున్నాయి. జనవరి 17వ తేదీన తుది ఆస్కార్ నామినేషన్లు ప్రకటించనున్నారు.