ప్రపంచస్థాయిలో వాతావరణ పరిరక్షణకు అన్ని దేశాలు కలిసికట్టుగా వ్యవహరించాలి. గణనీయ రీతిలో కార్బన్ ఉద్గారాల కట్టడికి చర్యలు తీసుకోవాలని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు నిచ్చారు. దుబాయ్ వేదికగా ఆరంభమైన పర్యావరణ ప్రపంచ స్థాయి సదస్సు కాప్ 28లో ఆయన ప్రసంగించారు. కేవలం ఆషామాషీగా లేదా నామమాత్రంగా గ్లోబల్ వ్యర్థాల కట్టడికి దిగితే సరిపోదని, తులనాత్మక గణనీయ స్థాయిలో తగు విధంగా నియంత్రణ చర్యలకు దిగాల్సి ఉంటుందని ప్రధాని స్పష్టం చేశారు. వ్యర్థాల కట్టడి విషయంలో భారతదేశం ఇతర దేశాలకు ఆదర్శంగా ఉంటుందని, గణాంకాలే ఈ విషయం స్పష్టం చేస్తున్నాయని తెలిపారు.
భారతదేశ జనాభా ప్రపంచ జనాభాతో పోలిస్తే 17 శాతం ఉంది. అయితే వ్యర్థాల విషయంలో ప్రపంచ వ్యాప్తంగా చూస్తే కేవలం 4 శాతం కార్బన్ ఉద్గారాలే వెలువడుతున్నాయని వివరించారు. భారతదేశంలో ప్రజల ప్రాతినిధ్యంతో గ్రీన్ క్రెడిట్ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వ ప్రమేయం ద్వారా పర్యావరణ స్థిరీకరణకు చర్యలు తీసుకుంటున్నామని ప్రధాని వివరించారు. పర్యావరణ పరిరక్షణ విషయంలో భారతదేశ చర్యలకు కట్టుబడుతూ ఉంటామని తెలిపిన ప్రధాని 2028లో జరిగే కాప్ సదస్సు లేదా కాప్ 33 ఇండియాలో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రతిపాదించారు. కాప్ 28లో భాగంగా ఇక్కడ వివిధ దేశాధినేతల ఉన్నత స్థాయి ప్రాతినిధ్యపు భేటీలో ప్రధాని మాట్లాడారు.
వాతావరణ పరిరక్షణ విషయంలో ప్రపంచదేశాలకు ఇప్పుడున్న పరిస్థితులలో గత శతాబ్ధి తప్పిదాలను చక్కదిద్దుకునే సమయం లేదా చొరవ లేకుండా పోతోందని, ఇది చాలా ఆందోళనకరమైన విషయం అని ప్రధాని తెలిపారు. భూగోళ పరిరక్షణ దిశలో అత్యంత కీలకమైన ప్రతిపాదనను భారతదేశం తీసుకువచ్చింద ని, ఇందులో భాగంగా ప్రతి నివాసం ప్రతి పౌరుడు ఎప్పటికప్పుడు కార్బన్ ఉద్గారాల కట్టడికి చర్యలు తీసుకుంటూ , ఇదే సమయంలో కార్బన్ ఉద్గారాల వెలువడుతున్న తీరుతెన్నుల గురించి తెలుసుకుంటూ ఉంటారని, కేవలం ఈ గ్రీన్‌కార్డు విధానానికి కట్టుబడితే వాతావరణ మార్పులను సరైన రీతిలో నియంత్రించేం దుకు వీలేర్పడుతుందని ప్రధాని స్పష్టం చేశారు. ప్రపంచ దేశాలన్ని కూడా ఈ పద్ధతిని పాటిస్తే వాతావరణ పరిరక్షణ విషయంలో సామూహిక భాగస్వామ్య ప్రక్రియకు దారితీస్తుందన్నారు.