ఇటలీలో జీ-7 సదస్సు జరుగుతున్న వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్‌కు కీలక ప్రతిపాదన చేశారు. రష్యా భూభాగాలుగా తాము ప్రకటించుకొన్న నాలుగు ప్రాంతాల నుంచి సైనిక దళాలను ఉపసంహరించుకొని, నాటోలో చేరాలన్న ఆలోచనను ఉక్రెయిన్ విరమించుకొంటే కాల్పుల విరమణను వెంటనే అమలు చేస్తామని చెప్పారు. ఉక్రెయిన్‌తో కొనసాగుతున్న సంఘర్షణకు ముగింపు పలకడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మాస్కో లోని విదేశాంగ కార్యాలయంలో ప్రసంగిస్తూ పుతిన్ చెప్పారు. ఉక్రెయిన్ అణ్వస్త్ర రహిత స్థితి, తన మిలిటరీపై నియంత్రణ, రష్యన్ మాట్లాడే ప్రజల హక్కులను పరిరక్షించడం వంటి హామీలను అంతర్జాతీయ ప్రాథమిక ఒప్పందాలకు అనుగుణంగా ఉక్రెయిన్ తమకు హామీ ఇవ్వాలని పుతిన్ కోరారు.
పుతిన్ ప్రతిపాదన పూర్తిగా అసంబద్ధమైనదని, మోసపూరితమైనదని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ విమర్శిం చింది. అంతర్జాతీయ సమాజాన్ని తప్పుదోవ పట్టించేందుకు, శాంతిస్థాపన లక్ష్యంగా జరుగుతున్న దౌత్య ప్రయత్నాలను దెబ్బతీసేందుకు చేస్తున్న ప్రయత్నమని ఆరోపించింది. ఉక్రెయిన్‌కు చెందిన దొనెట్స్, లుహాన్స్ ఖేర్సన్, జపోరిజియాలపై రష్యాకు పూర్తి నియంత్రణ లేనప్పటికీ అవి తమ దేశంలో 2022లో విలీనమైనట్టు రష్యా ప్రకటించింది.