భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో అమెరికాలో అడుగుపెట్టిన ఆ విద్యార్థి జీవితం అర్ధంతరంగా ముగిసిపోయింది. అమెరికా లో కత్తిపోట్లకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి వరుణ్ రాజ్ (29) మృతి చెందాడు. పది రోజులుగా తీవ్ర గాయాలతో లూథరన్ దవాఖానలో చికిత్స పొందుతున్న వరుణ్ పరిస్థితి విషమించడంతో తాజాగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.
ఖమ్మం జిల్లా మామిళ్లగూడెంకు చెందిన పుచ్చా వరుణ్ రాజ్ అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో ఎంఎస్ చదువుతున్నాడు. రోజూలాగే అక్టోబర్ 31న జిమ్‌కు వెళ్లిన వరుణ్ తిరిగి ఇంటికి వెళ్తుండగా ఓ దుండగుడు కత్తితో పొడిచాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. అయితే తీవ్రమైన నరాల బలహీనత ఏర్పడి ఎడమవైపు పాక్షిక వైకల్యం బారినపడే అవకాశం ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో వరుణ్‌కు లైఫ్‌సపోర్ట్‌తో వైద్యులు చికిత్స అందించారు. అయితే, పరిస్థితి విషమించడంతో తాజాగా ప్రాణాలు కోల్పోయాడు.
దాడిని ఖండించిన అమెరికా ప్రభుత్వం
అమెరికాలో తెలంగాణ విద్యార్థి కత్తి పోట్లకు గురైన అంశంపై అమెరికా సర్కార్ వెంటనే స్పందించింది. నిందితుడిపై చర్యలు తీసుకుంటామని చెప్పింది. వరుణ్ రాజ్ కోలుకునేంతవరకు అక్కడి ఎంబసీతో కలిసి సాయం అందిస్తామని మంత్రి కేటీఆర్ కూడా ప్రకటించారు.