Namaste NRI

సింగపూర్‌ తెలుగు సమాజం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబురాలు

సింగపూర్‌ తెలుగు సమాజం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబురాలు అంగరంగ వైభవంగా జరిగాయి. సింగపూర్‌ లోని పీజీపీ హాల్‌లో సంప్రదాయబద్ధంగా, తెలుగు లోగిళ్లలో ఉండే పూర్తి పండుగ వాతావరణంలో ఫిబ్రవరి 3వ తేదీ శనివారం నాడు ఈ వేడుకలను నిర్వహించారు.  సంక్రాంతి శోభతో తీర్చిదిద్దిన ప్రాంగణంలో హరిదాసు కీర్తనలు, యువతులతో గొబ్బెమ్మ పాటలు, సంప్రదాయ ఆటలు, భోగి పండ్లు వేడుక వంటి తెలుగింటి కార్యక్రమాలతో సింగపూర్‌లోని తెలుగు వారు చాలా సాంప్రదాయబద్దం గా జరుపుకున్నారు. మగువలకు రంగవల్లులు, వంటల పోటీలు నిర్వహించి విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులను అందచేశారు.

 ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాటలు, నృత్య ప్రదర్శనలు, నాటికలు మొదలగు సాంస్కృతిక కార్యక్రమా లతో పాటు విభిన్న కార్యక్రమాల ప్రదర్శనలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. సుమారు 35 మంది బాల బాలికలు రామాయణాన్ని చక్కగా ప్రదర్శించి ఆహుతుల మన్నలను పొందారు. సింగపూర్ తెలుగు మనబడి పిల్లలచే నిర్వహించిన ఈ ప్రదర్శన ప్రత్యేక ఆదరణ పొందింది.

ఈ సందర్భంగా తెలుగు క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఆగ్నేయాసిలో ప్రప్రథమంగా సింగపూర్‌ కాలమానం లో గుణించిన తెలుగు క్యాలెండర్‌ ఉండాలనే ఆలోచనతో సింగపూర్‌ తెలుగు సమాజం దీనికి కార్యరూపం తీసుకొచ్చింది. వరుసగా ఏడోసారి తెలుగు క్యాలెండర్‌ను సంక్రాంతి వేడుకల్లో ఆవిష్కరించారు. వీటిని అందరికీ ఉచితంగా ఇవ్వటంతో పాటు ఆండ్రాయిడ్ మరియు ఐవోఎస్‌లో STS TELUGU CALENDER యాప్‌ ద్వారా అందరికీ అందుబాటులో ఉంచారు.  సమాజ కార్యవర్గం మరియు కొన్ని స్ధానిక రెస్టారెంట్స్ ల సహకారంతో ఏర్పాటు చేసిన మన అచ్చ తెలుగు పిండివంటలు, 34 రకాల నోరూరించే వంటకాలతో కూడిన భోజనం స్థానిక తెలుగు వారిని విశేషంగా ఆకట్టుకుంది.

తెలుగు సంక్రాంతి వాతావరణంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన వారందరికీ STS అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులరెడ్డి పేరు పేరునా సంక్రాంతి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలిపారు. తమ కార్యవర్గం గత సంవత్సర కాలంగా నిర్వహించిన కార్యక్రమాలను వివరించడంతో పాటు అందరూ మరింత సహాయ సహకారాలను అందించాలని, 50వ ఆవిర్భావ దినోత్సవం లోపు సమాజ భవన స్వప్నాన్ని సాకారం చేసే దిశగా తోడ్పాటు అందించాలని కోరారు.

ఈ కార్యక్రమానికి సుమారు 700 తెలుగు వారు హాజరయ్యారని.. ఫేస్‌బుక్ లైవ్ ద్వారా 5,000 మంది వీక్షించినట్లు నిర్వాహకురాలు సుప్రియా కొత్త తెలిపారు. భోగి రోజున సుమారు 1,000 మందికి రేగి పండ్లను అందించామని , అలానే అయోధ్య బాల రాముని ప్రతిష్టాపన సందర్భంగా అక్కడనుంచి ప్రత్యేకంగా తెప్పించిన దివ్యాక్షతలను సుమారు 1,000 మందికి పంచామన్నారు. కార్యక్రమానికి హాజరైన వారికి, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న అందరికీ, స్వచ్ఛంద సేవకులకు, కార్యక్రమానికి సహకరించిన స్పాన్సర్లకు కార్యవర్గం తరుపున గౌరవ కార్యదర్శి అనిల్ పోలిశెట్టి ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress