వైసీపీ నేతలు తమ పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. గుంటూరు జిల్లా చింతలపూడిలో టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను చంద్రబాబు పరామర్శించారు. సంగం డెయిరీ కేసు వ్యవహారంలో అరెస్టయి జైలుకి వెళ్లొచ్చిన నరేంద్ర ఇంటికి వెళ్లారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని, చట్టాన్ని ఉల్లంఘించి పనిచేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. వైకాపా అవినీతి నుంచి దృష్టి మరల్చేందుకే తమ పార్టీ నేతలపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
వైకాపా నేతల అవినీతిపై కేసులు పెడితే విచారణకు కోర్టులు కూడా సరిపోవు. పోలీసు యంత్రాంగం కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. చట్ట వ్యతిరేకంగా ప్రజల్ని, టీడీపీని ఎలా హింసిస్తున్నారో వాటన్నింటినీ గుర్తు పెట్టుకుంటామని తెలిపారు. భవిష్యత్‌లో అన్నింటిపైనా సమీక్షలు చేస్తాం అన్నారు. రాయలసీమలో ముఠాకక్షలపై కఠినంగా వ్యవహరించి ప్రశాంతత తీసుకొచ్చాం. అక్కడ ఇప్పుడు మళ్లీ హత్యా రాజకీయాలు ప్రారంభిస్తున్నారు ఇది సబబా? అని ప్రశ్నించారు. నరేంద్రకు టీడీపీ అండగా ఉంటుందని, ప్రజలు కూడా అండగా నిలబడాలని పేర్కొన్నారు.