వచ్చే ఏడాది జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార దశలో ఇప్పుడు కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అనుకూల శిబిరంలోకి బ్రియాన్ స్వెన్సెన్ వచ్చి చేరారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష బరిలో ఇప్పుడు ప్రధాన వ్యక్తిగా ఉన్న భారతీయ సంతతి వ్యాపారవేత్త వివేక్ రామస్వామికి ఇప్పటి వరకూ బ్రియాన్ కుడిభుజంగా నిలిచారు. వివేక్ రామస్వామి ప్రచార బాధ్యతలు తీసుకుంటూ నేషనల్ పొలిటికల్ డైరెక్టర్గా వ్యవహరిస్తూ రామస్వామికి వేవ్ తీసుకువచ్చారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా ప్లేటు ఫిరాయించారు. తన బాధ్యతల నుంచి విరమించుకుంటున్నట్లు అధికారికంగా తెలిపారు.
బ్రియాన్ త్వరలోనే ట్రంప్ తరఫున ప్రచారం సాగిస్తారు. ముందుగా ఓటింగ్ జరిగే రాష్ట్రాలలో ప్రత్యేకించి నెవాడాలో ట్రంప్ అభ్యర్థిత్వానికి మద్దతుగా బ్రియాన్ ప్రచారం ఉంటుందని రిపబ్లికన్ పార్టీ వర్గాలు అనధికారికంగా తెలిపాయి. దీనితో రిపబ్లికన్ అభ్యర్థిగా బరిలోకి దిగిన రామస్వామి ప్రచారం కుంటుపడే పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు తెలిపారు.