జీ7 శిఖరాగ్ర సదస్సు వేళ ఇటలీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆ దేశ పార్లమెంట్ లో ఉద్రిక్త పరిస్థితి వెలుగుచూసింది. ఓ బిల్లు విషయంలో అధికార, విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో ప్రతిపక్ష నేతకు ఒకరికి గాయాలైనట్లు తెలుస్తోంది. సదరు సభ్యుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది.
ఇటలీలోని కొన్ని ప్రాంతాలకు ఆర్థికంగా మరింత స్వేచ్ఛ కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును అధికార కూటమి సభలో ప్రవేశపెట్టింది. ప్రజల నుంచి సేకరించిన పన్నుల వినియోగంపై ఆయా ప్రాంతాలకు మరింత స్వేచ్ఛను ఇచ్చేందుకు ఈ బిల్లును రూపొందించారు. దీన్ని ప్రతిపక్ష సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తు న్నారు. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎంపీ లియోనార్డో డోనో పార్లమెంట్‌లో ఇటలీ జాతీయ జెండాను ప్రదర్శించే ప్రయత్నించారు. ఈ క్రమంలో సభలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చట్ట సభ్యుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకుని కొట్టుకున్నారు. కాగా, ప్రస్తుతం ఇటలీ లో జీ7 శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే.