విదేశీ పర్యాటకులు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించేలా తానా సభ్యులు కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) స్వాతంత్య్ర భారత అమృతోత్సవం పేరుతో నిర్వహించిన వర్చువల్ మీటింగ్‌లో మంత్రి ముఖ్య అతిథిగా మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దేశానికి, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కేసీఆర్ సాగించిన పోరాటం మరో స్వాతంత్య్ర సంగ్రామాన్ని తలపించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న అత్యుత్తమ ఇండస్ట్రీయల్ పాలసీతో ఇతర రాష్ట్రాలు పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణకు వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి, మాజీ అధ్యక్షుడు జయశేఖర్ తాళ్లూరి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ చైర్మన్ డాక్టర్ హనుమయ్య తదితరులు పాల్గొన్నారు.