ప్రపంచంలో అత్యంత ఖరీదైన పదార్థం ఏంటి ? అనే ప్రశ్న ఎదురైతే వజ్రం, బంగారం, ప్లాటినం ఇలా అనేక సమాధానాలు వస్తాయి. అయితే, వీటన్నింటి కంటే ఖరీదైన పదార్థం ఒకటి ఉంది. అదే యాంటీమ్యాటర్. మిగతా ఖరీదైన పదార్థాల్లా దీనిని భూమి నుంచి తవ్వి తీయడానికి కుదరదు. ఒక్కో పరమాణువును కలుపుతూ దీనిని తయారుచేయాలి. ఇప్పుడు మనం చూస్తున్న విశ్వం ఆటమ్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లు, సబ్ ఆటమిక్ కణాలతో కూడిన మ్యాటర్ తో ఆవిర్భవించింది. ప్రతి మ్యాటర్ కణాలకు ప్రతిబింబం లాంటి యాంటీమ్యాటర్ కణాలు ఉంటాయి. మ్యాటర్ కణాలకు పాజిటివ్ ఛార్జ్ ఉంటే, యాంటీమ్యాటర్ కణాలకు నెగటివ్ ఛార్జ్ ఉంటుంది. ఈ యాంటీమ్యాటర్ తయారీ ఎంతటి క్లిష్టమైన ప్రక్రియ అంటే, ఒక్క గ్రాములో పదో వంతు తయారుచేయడానికి లక్షల సంవత్సరాలు పడుతుంది. అందుకే, ఒక్క గ్రాము యాంటీమ్యాటర్ తయారు చేయడానికి రూ.53 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా. 1999లో నాసా శాస్త్రవేత్త హరోల్డ్ గెర్రిష్ ఈ అంచనా వేశారు.
దీని తయారీకి కూడా అత్యాధునిక సాంకేతికత అవసరం. స్విట్జర్లాండ్లోని ఐరోపా అణు పరిశోధన సంస్థ సెర్న్ ఇప్పుడు యాంటీమ్యాటర్ తయారీకి ప్రయత్నిస్తున్నది. ఇందుకోసం భారీ పార్టికల్ యాక్సెలరేటర్లను వినియోగిస్తున్నది. ఇంత భారీ మొత్తంలో వెచ్చించి తయారుచేసే యాంటీ మ్యాటర్ను ఎక్కడ వినియోగిస్తారనేది కూడా ఆసక్తికరమే. యాంటీ మ్యాటర్ అంతులేని శక్తిని ఉత్పత్తి చేస్తుంది కాబట్టి అంతరిక్ష పరిశోధనలకు దీనిని ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. యాంటీమ్యాటర్ను భద్రపర్చడం అత్యంత కష్టం. ఇది మ్యాటర్తో కలిసినప్పుడు పేలుడు సంభవించి భారీగా శక్తి ఉత్పత్తి అవుతుంది. కాబట్టి, మ్యాటర్తో కలవకుండా యాంటీమ్యాటర్ను భద్రపరచాలి. ఇది కేవలం ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ క్షేత్రాల్లో మాత్రమే సాధ్యమని భావిస్తున్నారు.
