ఆత్మ విశ్వాసమే ఆస్తిగా పట్టుదలే పెట్టుబడిగా అనుక్షణం తమ పోరాట పటిమితో ఆకట్టుకున్న భారత పారాలింపియన్లు టోక్యో విశ్వ క్రీడలకు చిరస్మరణీయ ముగింపు ఇచ్చారు. పారాలింపిక్స్ చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన భారత అథ్లెట్లు ఓవరాల్‌గా 19 పతకాలతో టోక్యో క్రీడలను ముగించారు. అందులో ఐదు స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్యాలు ఉన్నాయి. విహంగాల్లా విహరిద్దాం అనే నినాదంతోనే సాగిన టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ 24వ స్థానంలో నిలిచింది. విశ్వ వేదికపై మనకిదే ఉత్తమ ప్రదర్శన కావడం విశేషం. పోటీల చివరి రోజు మన షట్లర్లు రెండు పతకాలు సాధించారు. కృష్ణ నాగర్ పసిడి పతకం కొల్లగొడితే నొయిడా జిల్లా మెజిస్ట్రేట్ సుహాస్ యుతిరాజ్ రజతం కైవసం చేసుకున్నాడు. ఈ మెగాటోర్నీలో భారత్ నుంచి 54 మంది బరిలోకి దిగగా, అందులో 17 మంది పతకాలు సాధించారు. షూటర్లు అవని, సింగ్‌రాజ్ రెండేసి పతకాలు చేజిక్కించుకున్నారు.
రియా (2016) పారాలింపిక్స్‌లో భారత్ నుంచి 19 మంది పోటీ పడి నాలుగు పతకాలు సాధించగా, ఈసారి దానికి నాలుగింతల పతకాలతో మనవాళ్లు అదరహో అనిపించారు. పారాలింపిక్స్‌లో కొత్త శకం ప్రారంభమైందని కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాఠ్ ఠాకూర్ అన్నారు. దేశాన్ని గర్వించేలా చేసిన వారందరికీ అభినందనలు అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పదమూడు రోజుల పాటు క్రీడాభిమానులను అలరించిన టోక్యో పారాలింపిక్స్ ఘనంగా ముగిశాయి.