అల్లరి నరేష్ కథానాయకుడిగా సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో రాజేష్ దండా నిర్మించిన చిత్రం బచ్చలమల్లి. ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. దీనికి కిరణ్ అబ్బవరం, సంయుక్త మీనన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లరి నరేష్ మాట్లాడుతూ ఈ సంవత్సరం బచ్చలమల్లి సినిమా సక్సెస్‌తో ఎండ్ అవుతుందనుకుం టున్నా. సినిమా అద్భుతంగా వచ్చింది. దర్శకుడు సుబ్బు తాను చెప్పింది తెరపై తీసుకొచ్చాడు. ఈ సినిమాను ఏ స్థాయిలో ఆదరిస్తారో అనే విషయం ప్రేక్షకుల చేతిలో ఉంది. ఒక్కటి మాత్రం పక్కా..ఈ క్రిస్మస్ మనదే అన్నారు. హాస్య మూవీస్‌ను తన హోమ్ బ్యానర్‌లా ఫీలవుతానని, నిర్మాత రాజేష్ దండా అన్‌కాంప్రమైజ్డ్‌గా సినిమా తీశారని చెప్పారు.
బచ్చలమల్లి క్యారెక్టర్‌ను నరేష్ మాత్రమే చేయగలరని, అంతలా ఆ పాత్రలో ఇన్‌వాల్వ్ అయ్యారని, ప్రేక్షకులు ఓ గొప్ప సినిమా చూసిన అనుభూతికి లోనవుతారని దర్శకుడు సుబ్బు మంగాదేవి పేర్కొన్నారు. ఈ సినిమాలో తాను పోషించిన కావేరి పాత్రను అందరూ ఇష్టపడతారని కథానాయిక అమృత అయ్యర్ చెప్పింది. నిర్మాత రాజేష్ దండా మాట్లాడుతూ దర్శకుడు సుబ్బు చెప్పిన ఈ కథకు ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయ్యాను. సింగిల్ సిట్టింగ్‌లో నరేష్ కథను ఓకే చేశారు. ఆయన సినిమాలన్నీ ఒకెత్తు అయితే బచ్చలమల్లి మరో ఎత్తు. ఈ సినిమాతో నరేష్ పేరు మోత మోగిపోద్ది అన్నారు. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకొస్తున్నది.