సత్యదేవ్, కన్నడ నటుడు డాలీ ధనుంజయ్ లీడ్ రోల్స్ చేసిన సినిమా జీబ్రా. ఈశ్వర్ కార్తీక్ దర్శకుడు. ఎస్.రెడ్డి, ఎస్.పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మాతలు. హీరో నాని ఈ సినిమా టీజర్‌ని ఆన్‌లైన్ లో లాంచ్ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సత్యదేవ్ మాట్లాడారు. దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ ఈ కథని జంగిల్, రాబిట్, లయన్ అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. జంగిల్ బుక్ తీస్తున్నాడేమో నా వాయిస్ కోసం వచ్చాడని అనుకున్నా. తర్వాత అసలు కథ చెప్పాడు. స్టోరీ అదిరిపోయిం ది. ఇంత అద్భుతమైన కథ ఇచ్చిన ఈశ్వర్‌కి థ్యాంక్స్. చాలా క్లారిటీగా స్క్రిప్ట్ రాసుకున్నాడు. ఇందులో చాలా కొత్తగా కనిపిస్తా. నా కెరీర్‌కి ఇది మైలురాయిలా నిలిచే సినిమా అని సత్యదేవ్ నమ్మకం వెలిబుచ్చారు.
ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన మంచు మనోజ్ చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు. దర్శకుడు ఈశ్వర్ అంకితభావంతో చేసిన సినిమా ఇదని, ఆడియన్స్ మంచి సినిమా చూడబోతున్నారని నటుడు డాలీ ధనుంజయ చెప్పారు. మంచి కంటెంట్‌తో తెరకెక్కుతున్న సినిమా ఇదని దర్శకుడు తెలిపారు. ఇంకా సత్యరాజ్, హీరోయిన్ జెన్నిఫర్ పిసినాటో, నిర్మాతలు కూడా మాట్లాడారు. అక్టోబర్ 31న సినిమా విడుదల కానుంది.