దక్షిణ ఐర్లాండ్లో జరిగిన కారు ప్రమాద ఘటనలో 20 ఏండ్ల వయసున్న ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఇక్కడి సౌత్ ఈస్ట్ టెక్నాలజికల్ యూనివర్సిటీలో చదువుకుంటున్న నలుగురు స్నేహితులు ప్రయాణిస్తున్న కారు గత వారం కార్లో కౌంటీలో చెట్టును ఢీకొన్నది. ఈ ఘటనలో చెరుకూరి సురేశ్ చౌదరి, చిత్తూరి భార్గవ్ అక్కడికక్కడే మరణించారని ఎమర్జెన్సీ సేవల విభాగం మీడియాకు తెలిపింది. గాయపడ్డ ఇద్దరు విద్యార్థులను దవాఖానకు తరలించి వైద్య చికిత్స అందిస్తున్నట్టు పేర్కొన్నది. డబ్లిన్లోని భారత ఎంబసీ ప్రమాద ఘటనపై తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. గాయపడ్డ విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించేందుకు సహకారమందిస్తున్నట్టు ప్రకటించింది.