కెనడా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కెనడా ప్రధానమంత్రి పదవికి, అధికార లిబరల్ పార్టీ ఆఫ్ కెనడా అధినేత పదవికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. ఒట్టావాలోని తన నివాసం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ మేరకు ఆయన ప్రకటన చేశారు. కొత్త ప్రధాని ఎన్నిక వరకు తాను ఈ పదవుల్లో కొనసాగుతానని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే కెనడా తదుపరి ప్రధానమంత్రి ఎవరు అవుతారు అనే ఉత్కంఠ ఇప్పుడు తీవ్రం అవుతోంది. అయితే కెనడా తదుపరి ప్రధాని రేసులో భారత సంతతి నేతల పేర్లు వినిపిస్తున్నాయి. అనితా ఆనంద్, జార్జ్ చాహల్ అనే భారత సంతతి వ్యక్తులు కెనడా ప్రధాని పదవి కోసం ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది.
జస్టిన్ ట్రూడో రాజీనామా నేపథ్యంలో ఆయన స్థానంలో ఎవరిని కూర్చోబెట్టాలి అనే పనిలో లిబరల్ పార్టీ నిమగ్నం అయింది. అయితే లిబరల్ పార్టీ నుంచి ప్రముఖంగా కొంతమంది పేర్లు బాగా వినిపిస్తున్నాయి. కెనడా ప్రధాని రేసులో క్రిస్టినా ఫ్రీలాండ్, మార్క్ కార్నీ, డొమినిక్ లీ బ్లాంక్, మెలనీ జోలీ, ఫ్రాంకోయిస్ ఫిలిప్పీ, క్రిస్టీ క్లార్క్‌లకు అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరితో పాటు భారత సంతతి వ్యక్తులు అయిన అనిత ఆనంద్, జార్జ్ చాహల్ పేర్లు కూడా వార్తల్లో నిలుస్తున్నాయి.