గతేడాది నవంబర్‌లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నెల 20న ఆయన అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నా రు. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన అధికారిక సన్నాహాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే ట్రంప్ ఎన్నికను అమెరికా కాంగ్రెస్ తాజాగా ధ్రువీకరించింది.
2020 నాటి నవంబర్ ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ చేతిలో ట్రంప్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బైడెన్ ఎన్నికను ధ్రువీకరించేందుకు నిర్వహించిన సమావేశం ఉద్రిక్తతకు దారి తీసింది. బైడెన్ గెలుపును ధ్రువీకరించేందుకు యూఎస్ కాంగ్రెస్ సమావేశమైన క్యాపిటల్ భవనంలోకి వేలాది మంది ట్రంప్ మద్దతుదారులు చొచ్చుకెళ్లి బీభత్సం సృష్టించారు. ఈ ఘటనను దృష్టిలో పెట్టుకొని ఈసారి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పటిష్ఠ బందోబస్తు నడుమ పార్లమెంట్ ఉమ్మడి సమావేశం జరిగింది.