అసెంబ్లీ ఎన్నికల ముందు తాము ఇచ్చిన ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మహాలక్ష్మీ పథకాన్ని, ఆరోగ్య శ్రీ లిమిట్‌ను రూ.10 లక్షలకు పెంచుతూ మరో స్కీమ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరోగ్య శ్రీ కొత్త పోస్టర్‌తోపాటు జీరో ఛార్జ్ టికెట్‌ను మంత్రులతో కలిసి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున బాక్సర్ నిఖత్ జరీన్‌కు రూ.2 కోట్ల చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు తెలంగాణ ప్రజలకు పండగరోజు అని అన్నారు. 2009, డిసెంబర్ 9న తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందని, తెలంగాణ తల్లి అంటే సోనియమ్మ రూపం కనిపిస్తుందన్నారు. ప్రతి ఒక్కరికి నాది తెలంగాణ అని చెప్పే అవకాశం మనకు సోనియమ్మ ఇచ్చారని అన్నారు. ఇక్కడి ప్రజల కోసమే సోనియమ్మ ఆరు గ్యారంటీలను ఇచ్చారని, వీటిలో రెండు గ్యారంటీలను అమలు చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందన్నారు. మహిళలు నేటి నుంచి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తామన్నారు. ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని ప్రకటించారు. తెలంగాణను సంక్షేమ రాజ్యంగా మారుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీఎస్ శాంతికుమారి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, అధికారులు పాల్గన్నారు.