రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే దిశగా మరో ముందడుగు పడింది. సౌదీ అరేబియాలో అమెరికా, రష్యా విదేశాంగ శాఖ మంత్రులు మార్కో రుబియో, సెర్గేయ్ లావ్రోవ్ సమావేశమయ్యారు. వీలైనంత త్వరగా యుద్ధాన్ని ముగించే దిశగా ప్రయత్నాలు ప్రారంభించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఈ ప్రక్రియను చేపట్టేందుకు ఇరు దేశాలు ఉన్నత స్థాయి బృందాలను నియమించాయి. యుద్ధాన్ని ముగించడంతో పాటు అమెరికా – రష్యా సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో ఇరు దేశాల మంత్రులు నిర్ణయం తీసుకున్నారు. అమెరికా – రష్యా చర్చల తీరుపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ సమ్మతి లేకుండా తమపై రుద్దే రాజీ ఒప్పందాన్ని ఉక్రెయిన్ అంగీకరించబోదని ఆయన స్పష్టం చేశారు. ఈ చర్చల నేపథ్యంలో ఈ వారం జరగాల్సిన తన సౌదీ పర్యటనను మార్చికి వాయిదా వేసుకున్నారు.
