మిస్ ఇండియా యూఎస్‌ఏ 2021 కిరీటాన్ని మిషిగన్‌కు చెందిన వైదేహి డోంగ్రే (25) కైవసం చేసుకుంది. ఈ అందాల పోటీల్లో జార్జియాకు చెందిన అర్షి లలాని మొదటి రన్నరప్‌గా నిలిచింది. డోంగ్రే యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఓ ప్రధాన సంస్థలో వ్యాపార అభివృద్ధి నిర్వాహకురాలిగా పనిచేస్తుంది. అందాల పోటీలో విజేతగా నిలిచిన అంశాన్ని తన ఇన్‌స్టాగ్రాం పేజీ ద్వారా తెలుపుతూ డోంగ్రే పలు చిత్రాలను పంచుకుంది. ఈ విజయం తన ఆత్మ విశ్వాసాన్ని మరింత పెంచిందన్నారు. మహిళల ఆర్థిక స్వాతంత్రం, అక్షరాస్యతపై దృష్టి సారించనున్నట్లు ఆమె వెల్లడిరచింది.
భారతీయ సంతతికి చెందిన మహిళల శక్తిసామర్థ్యాలు పెంపొందేలా, వారిని ప్రోత్సహించేందుకు ఈ మిస్ ఇండియా యూఎస్‌ఏ పోటీలు ఓ వేదికగా నిలుస్తున్నాయి. తన భవిష్యత్ లక్ష్యాలు అందుకునేందుకు మిస్ ఇండియా యూఎస్‌ఏ వేదిక దోహదపడనున్నట్లుగా డోంగ్రే విశ్వాసాన్ని వ్యక్తం చేసింది.