నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందిన చిత్రం భగవంత్‌కేసరి. శ్రీలీల, కాజల్, అర్జున్ రాంపాల్ కీలక భూమికలు పోషించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించిన ఈ చిత్రం ఈనెల 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలకృష్ణ మాట్లాడారు. నవరాత్రులు జరుపుకుంటున్న శుభతరుణంలో నా 108వ చిత్రం భగవంత్ కేసరి విడుదలవు తుండటం ఆనందంగా ఉంది. దుర్గ అంటే స్త్రీ శక్తి. ఈ సినిమా కథ కూడా స్త్రీశక్తికి సంబంధించినదే. దుర్గమ్మ వాహనం పులి. ఇందులో అమ్మాయిని పులిలా పెంచాలనే మాట రాశారు దర్శకుడు అనిల్‌రావిపూడి. ఆ తల్లి ఆశీస్సులతో ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందని నా నమ్మకం అన్నారు.
అనిల్ అద్భుతమైన కథతో నా దగ్గరకొచ్చాడు. ఈ కథపై ఇద్దరం ఎంతో హోమ్‌వర్క్ చేశాం. కోరుకున్నది రాబట్టుకోవడంలో అనిల్ దిట్ట. అందుకే అన్ని విభాగాల్లో సినిమా అద్భుతంగా వచ్చింది. శ్రీలీల బోర్న్ ఆర్టిస్ట్. మా ఇద్దరి కాంబినేషన్ సీన్స్ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. ఈ సినిమా ప్రారంభం మాత్రమే కూల్‌గా ఉంటుంది. ఓ విస్పోటనం జరిగితేగానీ అద్భుతాలు జరగవు. అలాంటి అద్భుతమే భగవంత్‌కేసరి. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, అఖండలా నా కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా భగవంత్‌కేసరి అని నమ్మకం వ్యక్తం చేశారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ నవ్వించేవాడిలో భావోద్వేగాలు కూడా ఎక్కువగా ఉంటాయంటారు. మొన్నటివరకూ నవ్వించాను. ఈ సినిమా ద్వారా ఉద్వేగానికి లోనుచేస్తాను అని అన్నారు.