వెంకటేష్ కథానాయకుడిగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం సైంధవ్. నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధాశ్రీనాథ్, రుహానీ శర్మ, సారా తదితరులు నటించారు. బుధవారం ట్రైలర్‌ను ఆవిష్కరించారు. కూతురే సర్వస్వంగా జీవిస్తుంటాడు తండ్రి. ఇంతలో ఆ చిన్నారికి మస్క్యులర్ అట్రోఫీ అనే అరుదైన వ్యాధి నిర్ధారణ జరుగుతుంది. వ్యాధిని నయం చేసే ఇంజక్షన్ ఖరీదు 17కోట్లు. ఈ క్రమంలో ఆ తండ్రి పడే సంఘర్షణ, ప్రత్యర్థులతో చేసే పోరాటం నేపథ్యంలో ట్రైలర్ ఆద్యంతం భావోద్వేగ ప్రధానంగా సాగింది. యాక్షన్ ఘట్టాలు రొమాంచితంగా అనిపించాయి. వెంకటేష్ మాట్లాడుతూ న్యూఏజ్ యాక్షన్ థ్రిల్లర్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఈ సినిమాతో ఆ కోరిక తీరింది. కథ మొదలైన 15నిమిషాల్లోనే భావోద్వేగాలతో ప్రేక్షకులు సహానుభూతి చెందుతారు. నా కెరీర్‌లోనే బెస్ట్ ఫిల్మ్‌గా చెప్పొచ్చు అన్నారు.
దర్శకుడు శైలేష్ కొలను మాట్లాడుతూ ట్రైలర్‌లో కథ మొత్తం చెప్పాను. ఇంత ధైర్యంగా కథ రివీల్ చేశానంటే సినిమాలోని ఉద్వేగాలు ఏ స్థాయిలో ఉంటాయో మీ ఊహకే వదిలేస్తున్నా. హాలీవుడ్ స్థాయి హంగులతో ఈ సినిమాను తెరకెక్కించాం. ఈ సంక్రాంతికి అందరిని ఎంటర్‌టైన్ చేస్తుంది అన్నారు. వెంకటేష్ అంటే తనకు ఎంతో గౌరవం, ఇష్టమని ఈ సినిమా ఓ విందు భోజనంలా ఉంటుందని చిత్ర నిర్మాత వెంకట్ బోయనపల్లి చెప్పారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతాన్నందించారు. ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకురానుంది.