దక్షిణ కొరియా రాజధాని సియోల్ నగరంలో వరుసగా రెండో రోజు తీవ్ర స్థాయి హిమపాతం కురిసింది. దీంతో ఆ నగరం అంతా మంచు దుప్పటి పరిచినట్లు అయ్యింది. డజన్ల సంఖ్యలో విమానాలను రద్దు చేశారు. బోట్లు కూడా రద్దు అయ్యాయి. చలి తీవ్రత తట్టుకోలేక కనీసం అయిదు మంది మృతిచెంది ఉంటారని భావిస్తున్నా రు. గడిచిన శతాబ్ధ కాలంలో ఇంత భారీ స్థాయిలో హిమపాతం కురవడం ఇది మూడోసారి. రికార్డుల ప్రకారం 1907 నుంచి ఇప్పటి వరకు మూడుసార్లు మాత్రమే సియోల్‌లో ఈ స్థాయిలో మంచు కురిసింది.
సియోల్ నగరంలోని అనేక ప్రాంతాల్లో సుమారు 40 సెంటీమీటర్ల మేర మంచు పేరుకుపోయింది. దీంతో దాదాపు 140 విమానాలను రద్దు చేశారు. గ్యాంగ్వాన్ ప్రావిన్సులోని వోంజు నగరంలో సుమారు 53 వాహనాలు ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి. ఆ ఘటనలో 11 మంది గాయపడ్డారు. సియోల్‌లోని ప్రధాన విమానాశ్రయం ఇంచియాన్‌లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విమానాలు దాదాపు రెండు గంటల పాటు ఆలస్యంగా నడిచాయి. గియాంగి ప్రావిన్సులో ఉన్న వందలాది స్కూళ్లను మూసివేశారు. పొరుగుదేశమైన ఉత్తర కొరియాలో కూడా తీవ్ర స్థాయిలో మంచు కురిసింది. సుమారు 10 సెంటీమీటర్ల మేర మంచు పేరుకుపోయింది.