దక్షిణ అమెరికాలోని పనామా సిటీలో పురాతన నాగరికతకు చెందిన ఆనవాళ్లు బయటపడ్డాయి. సుమారు 12 శతాబ్దాల నాటి సమాధిని తవ్వుతుండగా భారీ ఎత్తున బంగారం, విలువైన వస్తువులు బయటపడ్డాయి. పనామా సిటీకి సుమారు 110 మైళ్ల దూరంలోగల ఎల్‌కానో ఆర్కియాలాజికల్ పార్క్ వద్ద తవ్వకాలు జరుపుతుండగా ఈ నిధి వెలుగులోకి వచ్చింది. తాజా గా బయటపడ్డ ఈ భారీ సమాధిలో పెద్దఎత్తున బంగారు నిధితోపాటు చాలా మృతదేహాల అవశేషాలు కూడా ఉన్నాయి. ఇది అమెరికాలోకి యూరోపియన్‌ల రాకకు ముందు జీవించిన స్థానిక తెగల జీవితాలను గురించి తెలియజేస్తోంది. ఈ సమాధి ఒక ముఖ్యమైన చారిత్రక సాంస్కృతిని ఆవిష్క రిస్తుందని చెప్పొచ్చు. ఆ సమాధిలో బంగారు శాలువా, బెల్టులు, ఆభరణాలు, తిమిగలం పళ్లతో చేసిన చెవి పోగులు, విలువైన వస్తువులు ఉన్నాయని పురావస్తు శాఖ డైరెక్టర్ డాక్టర్ జూలియా మాయో వెల్లడించారు.
సమాధిలో సుమారు 32 మృతదేహాల అవశేషాలను గుర్తించినట్లు మాయో తెలిపారు. ఆ సమాధి కోకల్ సంస్కృ తికి చెందిన ఉన్నత వర్గం ప్రభువుదిగా పురావస్తు శాఖ పరిశోధకులు భావిస్తున్నారు. నాటి ఆచారం ప్రకారం ఉన్నత వర్గం ప్రభువు మరణిస్తే ఇలా ఈ 32 మందిని బలిచ్చి, విలువైన వస్తువులు, ఆభరణాలు పాతిపెట్టి ఉంటారని వారు అనుమానిస్తున్నారు. అయితే ఆ వ్యక్తుల సంఖ్య కచ్చితంగా ఎంత అనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని మాయో చెప్పారు.