ముంబైకు చెందిన 16 ఏళ్ల కామ్యా కార్తికేయన్ పర్వతారోహణలో ప్రపంచ రికార్డును సాధించింది. ఏడు ఖండాల వ్యాప్తంగా ఏడు అత్యంత ఎత్తైన పర్వతాలను అధిరోహించిన అతి పిన్నవయస్కురాలైన బాలికగా కామ్య చరిత్ర సృష్టించింది. ఏడు పర్వతాలను అధిరోహించే సవాల్‌ను స్వీకరించిన కామ్య మౌంట్ కిలిమంజారో(ఆఫ్రికా), మౌంట్ ఎల్‌బ్రస్(యూరపు), మౌంట్ కాజీయాస్కో (ఆస్ట్రేలియా), మౌంట్ అకాన్‌కాగువా(దక్షిణ అమెరికా), మౌంట్ డెనలి(ఉత్తర అమెరికా), మౌంట్ ఎవరెస్ట్(ఆసియా), మౌంట్ విన్సన్(అంటార్కటికా)లను విజయవంతంగా అధిరోహించింది.
తన తండ్రి కమాండర్ కార్తికేయన్‌తో కలసి మౌంట్ విన్సన్ చేరుకున్న కామ్య డిసెంబర్ 24న సప్త పర్వాతాధిరోహణ సవాల్‌ను పూర్తి చేసింది. ముంబైలోని నేవీ చిల్డ్రన్ స్కూల్‌లో 12వ తరగతి చదువుతున్న కామ్య, ఆమె తండ్రి కమాండర్ కార్తికేయన్‌ను భారతీయ నేవీ అభినందించింది. ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం చేరుకోవడాన్ని తన తదుపరి లక్ష్యంగా కామ్య నిర్దేశించుకుంది.