
దేశంలో ఏటికేడు పడిపోతున్న సంతానోత్పత్తి రేటుపై అమెరికా సర్కారు దృష్టి సారించినట్టు తెలుస్తున్నది. జనాభా పెరిగేలా పలు ప్రోత్సాహకాలు ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. పిల్లల్ని కనే తల్లులకు 5 వేల డాలర్ల (సుమారు రూ.4.25 లక్షలు) బేబీ బోనస్ ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తున్నది. దాంతో పాటు చైల్డ్ ట్యాక్స్ క్రెడిట్ (పన్ను మినహాయింపులు) పెంపు, ఫెడరల్ ప్రభుత్వం సాయంతో ఇచ్చే ఫుల్‌బ్రైట్ స్కాలర్‌షిప్ ప్రోగ్రాం లాంటి వాటిలో పెండ్లి అయిన దంపతులు, పిల్లలున్న వారికి 30 శాతం రిజర్వేషన్ తదితర ప్రతిపాదనలు ఉన్నట్టు సమాచారం. అంతేకాదు, సంతానం సంబంధిత విషయాలపై అమెరికన్ మహిళలకు అవగాహన కల్పించడం లాంటి ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ ప్రతిపాదనలకు వైట్‌హౌజ్ అధికారికంగా ఆమోదం తెలపనప్పటికీ, సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తున్నది.
