ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసే ప్రపంచ అందాల పోటీలకు తెలంగాణ వేదిక కానున్నది. ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీలను హైదరాబాద్లో నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయించారు. 72వ మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనున్నది. దాదాపు నాలుగు వారాల పాటు జరిగే ఈ పోటీల ప్రారంభ, ముగింపు వేడుకలతో పాటు గ్రాండ్ ఫినాలేను సైతం హైదరాబాద్లోనే నిర్వహించనున్నారు. ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ ఫెస్టివల్లో 120కిపైగా దేశాలు పాల్గొంటాయి. బ్యూటీ విత్ ఏ పర్పస్ అనే థీమ్తో ఈ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించనుండగా, దేశ విదేశాల ప్రతినిధులకు తెలంగాణ స్వాగతం పలుకబోతున్నది.
మే 7 నుంచి ఈ అందాల పోటీలు జరగనున్నాయి. మే 31న గ్రాండ్ ఫినాలే నిర్వహిస్తారు. గతంలో న్యూఢిల్లీ, ముంబయి నగరాల్లో ఈ అందాల పోటీలు జరిగాయి. 71వ ఎడిషన్ ముంబయిలో నిర్వహించిన విషయం తెలిసిందే. తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలను స్వాగతిస్తున్నామని మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్మన్, సీఈఓ జూలియా మోర్లీ, తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ ప్రకటించారు.
