భారత్‌లో విస్తరిస్తున్న డిజిటల్ విప్లవాన్ని ఐక్యరాజ్యసమితి ప్రశంసించింది. గత ఐదారేళ్లలో భారత ప్రభుత్వం 80 కోట్ల మంది ప్రజలను కేవలం స్మార్ట్‌ఫోన్ల వాడకం ద్వారా పేదరికం నుంచి బయటపడేసిందని ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ (యూఎన్‌జీఏ) అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ పేర్కొన్నారు. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. భారత్‌లోని గ్రామీణ ప్రాంతాలకు బ్యాకింగ్ సేవలను విస్తరించడంపై హర్షం వ్యక్తం చేశారు.డిజిటలైజేషన్ అనేది ఓ దేశం వేగవం తంగా అభివృద్ధి చెందేందుకు కారణం అవుతుంది. ఉదాహరణకు భారత్‌నే తీసుకోండి. గత ఐదారేళ్ల లోనే స్మార్ట్‌ఫోన్‌ల వాడకం ద్వారా 800 మిలియన్ల (80 కోట్ల మంది) మంది భారతీయులను పేదరికం నుంచి బయటపడేయగలిగింది.
గతంలో భారత్‌లోని గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలు, ఆన్‌లైన్ చెల్లింపుల వ్యవస్థలు అందుబాటులో ఉండేవి కావు. కానీ ఇప్పుడు గ్రామీణ రైతులు పేమెంట్స్ అందుకోవడం, బిల్లులు చెల్లించడం వంటివి స్మార్ట్ ఫోన్ ద్వారానే చిటికెలో చేసేస్తున్నారు. బ్యాంకింగ్ సేవలను సులభతరం చేసి, దేశ ప్రజలు ప్రయోజనం పొందడానికి భారత్‌లో ఇంటర్‌నెట్ వ్యాప్తి ఎంతగానో తోడ్పడుతోంది. మిగిలిన దేశాలు కూడా గ్రామీణ ప్రాంతా ల అభివృద్ధి కోసం ఇటువంటి చర్యలు తీసుకోవాలి అని ఆయన పేర్కొన్నారు.