ప్రముఖ సోషల్ మీడియా సంస్ఠ ట్విట్టర్ పగ్గాలు భారత సంతతి టెక్కీ చేతికి వచ్చాయి. ట్విట్టర్ కొత్త సీఈవోగా పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. సీఈవోగా ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే దిగిపోవడంతో ఆయన స్థానంలో చీఫ్ టెక్నికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న పరాగ్ అగర్వాల్‌ను సంస్థ బోర్డు ఏకగ్రీవంగా ఎక్నుకున్నది. 2006లో మరో ముగ్గరితో కలిసి డోర్సే ట్విటర్‌ను స్థాపించిన విషయం తెలిసిందే. అప్పట్నుంచి ఇప్పటిదాకా ట్విటర్ సారథిగా డోర్సేనే కొనసాగుతున్నారు. దాదాపు 16 ఏండ్ల అనంతరం కొత్త సీఈవోగా రాగా, అదికూడా ఓ భారతీయుడికి అవకాశం లభించడం గమనార్హం.
ఐఐటీ బాంబే, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి అయిన పరాగ్ అగర్వాల్ పదేండ్ల క్రితం ట్విట్టర్లో యాడ్స్ ఇంజినీర్‌గా చేరారు. అంచెలంచెలుగా ఎదుగుతూ 2017లో సంస్థ టెక్నాలజీ అధిపతిగా పదోన్నతి పొందారు. ఇప్పుడు సీఈవోగా ఎన్నికయ్యారు. గతంలో మైక్రోసాఫ్ట్, యాహూ తదితర సంస్థల్లోనూ పనిచేశారు.ఈ బాధ్యత నాకు రావడం పట్ల గర్వపడుతున్నాను. డోర్సే మార్గదర్శకత్వాన్ని కొనసాగిస్తాను. ఆయన స్నేహానికి కృతజ్ఞతలు అని ఈ సందర్భంగా పరాగ్ అన్నారు.