తెలుగు ఇండస్ట్రీలో మరో శకానికి ముగింపు పడిరది. ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రీ ఇక లేరన్న వార్త టాలీవుడ్‌లో విషాదం నింపింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం 4:07 గంటలకు తుదిశ్వాస విడిచారు. సిరివెన్నెల పూర్తి పేరు చేంబోలు సీతారామశాస్త్రి. విశాఖ జిల్లా అనకాపల్లిలో 1955 మే 20న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు డాక్టర్ సి.వి.యోగి, తల్లి సుబ్బలక్ష్మి. కాకినాడలో ఇంటర్మీడియెట్ వరకూ చదువుకున్నా ఆయన, ఆంధ్ర విశ్వ కళాపరిషత్తులో బీఏ పూర్తి చేశాడు. ఆయన కొంతకాలం పాటు టెలిఫోన్స్‌లో శాఖలో పని చేశారు.
ప్రఖ్యాత దర్శకుడు విశ్వనాధ్ అవకాశం కల్పించడంతో సిరివెన్నెల సినిమాలో పాటలన్నీ రాశారు. సిరివెన్నెల చిత్రం సూపర్ హిట్ కావడంతో సిరివెన్నెల సీతారామశాస్త్రిగా ప్రసిద్ధి గాంచారు. మూడున్నర దశాబ్దాల సినీ జీవితంలో సిరివెన్నెల మూడు వేలకు పైగా పాటలు రాశారు. విధాత తలపున ప్రభవించినది సిరివెన్నెల రాసిన తొలి పాట.చివరిసారిగా అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రంలో చిట్టు అడుగు అనే పాట రాశారు. సినీ సాహిత్యరంగంలో చేసిన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం సిరివెన్నెల సీతారామశాస్త్రిని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఆయన సినీ కెరీర్‌లో మొత్తం 11 నంది అవార్డులు, నాలుగు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు.