అమెరికాకు వ్యతిరేకంగా రష్యా, చైనా జట్టుగా ముందుకు కదిలే సూచనలు కనిపిస్తున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధినేత జిన్‌పింగ్ వర్చువల్ భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాల గురించి వీరు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ఇరు దేశాలు చాలా పాత స్నేహితులని జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు. తాము తమ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న సందర్భాల్లో తమ వైపు రష్యా గట్టిగా నిల్చుందని జిన్‌పింగ్ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహితాన్ని కొందరు ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇరు దేశాలు కొన్ని రంగాల్లో కలిసి నడవడానికి ప్రణాళికలు రూపొందిస్తామని జిన్‌పింగ్ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న బంధం భాగస్వామ్యం కంటే ఉన్నతమైనదిగా ఆయన అభివర్ణించారు. ఉక్రెయిన్ విషయంలో అమెరికా, రష్యా మధ్య విభేదాలు తలెత్తిన నేపథ్యంలో జిన్‌పింగ్ వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.