ప్రపంచ మార్కెట్లో భారత ప్రతిభ ప్రభ వెలిగిపోతుంది. ట్విట్టర్ సీఈవోగా పరాగ్ అగర్వాల్ నియమితుడైన మరికొన్ని రోజుల్లో మరో అంతర్జాతీయ సంస్థకు సీఈవోగా పని చేసే అవకాశం ప్రవాస భారతీయులకు దక్కింది. లండన్‌లో నివసిస్తున్న ఎన్నారై లీనా నాయర్ ప్రఖ్యాత ఫ్రెంచ్ ఫ్యాషన్ హౌజ్ షునల్‌కి గ్లోబల్ సీఈవోగా నియమితులయ్యారు. 2022 జనవరిలో ఆమె ఈ పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. గతంలో ఆమె యునీలివర్ ప్రతినిధిగా ఉన్నారు. హిందుస్తాన్ యునీలివర్‌లో 30 ఏళ్ల క్రితం మేనేజ్మెంట్ ట్రైనీగా లీనా నాయర్ తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ కంపెనీ మేనేజ్మెంట్ కమిటీలో సభ్యురాలైన తొలి మహిళగా ఆమె నిలిచారు.
ఇండియాలో పుట్టిన లీనా నాయర్‌కు బ్రిటన్‌లో పౌరసత్వం ఉన్నది. ఛానెల్ కంపెనీ లగ్జరీ వస్తువులకు చాలా ఫేమస్, సూట్లు, హ్యాండ్‌బ్యాగ్‌లు, పర్ఫ్యూమ్లకు ఛానెల్ పెట్టింది పేరు. బిలియనీర్ అలెయిన్ వెర్తివేయర్ ఇప్పుడు ఆ కంపెనీ ఓనర్‌గా ఉన్నారు. కొన్నాళ్లు సీఈవోగా ఉన్న ఆయన ఇప్పుడు ఆ పదవి నుంచి తప్పుకున్నారు. 1910లో ఫ్యాషన్ లెజెండ్ గ్యాబ్రియెల్లీ కోకో ఛానెల్ ఆ కంపెనీని స్టార్ట్ చేశారు.