విదేశాల్లో స్థిరపడినప్పటికీ మాతృభూమిని మరిచిపోవద్దని, ఎన్నారైలు మన దేశ సంస్కృతిని పెంపొందించేలా పలు కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఆటా వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ అమెరికాలో తెలుగువారు లేని రాష్ట్రం లేదని అన్నారు. అనేక రంగాల్లో తెలుగువారు రాణిస్తున్నారని కొనియాడారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేయాలని పిలుపునిచ్చారు. భారత సంతతికి చెందిన వ్యక్తులు అమెరికా రాజకీయాల్లోనూ కీలకపాత్ర పోషించే స్థాయికి ఎదగడం సంతోషంగా ఉందన్నారు. ఎన్నారైలు పలు గ్రామాల అభివృద్ధికి సహకరించడం అభినందనీయమని, రానున్న రోజుల్లోనూ గ్రామాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఆటా చేపట్టినా సామాజిక సేవల్ని కొనసాగించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుకు వెళ్తోందని మంత్రి ప్రశాంత్ రెడ్డి వెల్లడిరచారు.
ఈ సందర్భంగా పద్మశ్రీ శోభారాజ్‌కు జీవన సాఫల్య పురస్కారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా, అంతరాష్ట్రాల వ్యవహారాల సలహాదారుడు దేవులపల్లి అమర్‌కు ఎక్సలెన్సీ అవార్డులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సినీ నటులు భానుచందర్, సుమన్, మధు బొమ్మినేని, భువనేశ్ భుజాల, అనిల్ బోదిరెడ్డి, ఆటా ప్రతినిధులు పాల్గొన్నారు.