పిల్లలు దూరంగా ఉన్నారనే లోటు లేకుండా వృద్ధులకు భరోసా కల్పించేందుకు వృద్ధాశ్రమ నిర్మాణం చేపట్టడం అభినందనీయమని తానా మాజీ అధ్యక్షుడు సతీశ్ వేమన ప్రశంసించారు. వృద్ధాశ్రమ నిర్మాణానికి సంబంధించి బ్రోచర్‌ను ఈ సందర్భంగా సతీశ్ వేమన ఆవిష్కరించారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరిగిన కార్యక్రమంలో ఆశ్రమానికి సంబంధించిన వివరాలను మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు వెల్లడిరచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా మోతడకలో రూ.25 కోట్లతో 200 మందికి వసతి కల్పించే లక్ష్యంతో కాకతీయ వయో వృద్ధుల ఆశ్రమం నిర్మిస్తున్నామని తెలిపారు. తొలిదశలో 200 మందికి ఆశ్రయం కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించామని, తరువాత మరింత విస్తరిస్తామని కొత్తపల్లి రమేశ్ కృష్ణచంద్ర తెలిపారు. 2023 నాటికి వృద్ధాశ్రమ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో తెలుగు కుటుంబాలవారు భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామ్‌చౌదరి ఉప్పుటూరి, సిద్ధార్థ బోయపాటి, డాక్టర్ నాగ శంకర్ దేవినేని, రమాకాంత్ కోయ, డాక్టర్ లిఖిత ఎల్లా, సాయి మండవ, భానుప్రసాద్ మాగులూరు తదితరులు పాల్గొన్నారు.