కరోనా దెబ్బకు రష్యా విలవిల లాడిపోతుంది. రష్యాలో కరోనా వైరస్ మళ్లీ విలయతాండవం చేస్తుంది. దేశవ్యాప్తంగా గత నెలలో 71 వేలకు పైగా మంది కరోనాకు బలయ్యారు. వైరస్ వల్ల నవంబర్ నెలలో రికార్డు స్థాయిలో 71,187 మంది బాధితులు మృతి చెందారని రష్యన్ స్టాటిస్టిక్స్ ఏజెన్సీ రోస్‌స్టాట్ వెల్లడిరచింది. అయితే గత నెలలో మొత్తం 87,257 మంది చనిపోయారని, వారిలో కొందరివి కరోనా మరణాలు కాదని తేల్చింది. మహమ్మారి వల్ల దేశంలో 3,07,948 మంది మరణించారని కరోనాపై నియమించిన ప్రభుత్వ టాస్క్ ఫోర్క్ గణాంకాలు తెలుపుతున్నాయి. గత 11 నెలల్లో దేశ జనాభా 9 లక్షల 45 వేలు తగ్గింది. గతేడాది ఇది 5 లక్షల 74 వేలుగా ఉన్నది.
నిజానికి ఈ వైరస్ వెలుగు చూసిన తొలినాళ్ళలో అపార నష్టాన్ని ఎదుర్కొన్న దేశాల్లో రష్యా కూడా ఒకటి. ఆ తర్వాత కాస్త శాంతించింది. ఈ క్రమంలో ఇపుడు కొత్త కేసులు, మరణాలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలు, కేసులు నమోదైన దేశాల జాబితాలో రష్యా ఐదో స్థానంలో నిలిచింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతుండడం, కరోనా నిబంధనల విషయంలో చూసి చూడనట్టు వ్యవహరిస్తుండడమే కరోనా తాజా విజృంభణకు కారణంగా తెలుస్తోంది. కాగా, రష్యా అధికారులు కరోనా మరణాలకు తక్కువగా చూపుతున్నారన్న విమర్శలు ఉన్నాయి.