కరోనా ఒమిక్రాన్‌లో స్వల్ప లక్షణాలు ఉంటున్నాయని ఎన్నో ఆధారాలు తెలియజేస్తున్నాయి అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) శుభవార్త తెలియజేసింది. ఒమిక్రాన్ కరోనా రకం అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ (శ్వాస వ్యవస్థలో ఎగువ భాగం) పైనే ప్రభవం చూపిస్తోంది. గత రకాలతో పోలిస్తే స్వల్ప లక్షణాలనే కలిగిస్తోంది. ఫలితమే కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ మరణాల రేటు తక్కువగా ఉండడం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇన్సిడెంట్ మేనేజర్ అబీద్ మహమ్మద్ తెలిపారు. కరోనా రకాలతో ఊపిరితిత్తుల్లో తీవ్రమైన న్యూమోనియా ఏర్పడేది. కానీ, ఇది అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ కే పరిమితం అవుతోందని ఎన్నో పరిశోధనలు చెబుతున్నాయి. ఇది నిజంగానే శుభవార్తే. కానీ దీన్ని నిర్ధారించేందుకు మరిన్ని అధ్యయనాలు జరగాలి అని పేర్కొన్నారు.
కరోనా కేసులు పెరుగుతున్నా మరణాలు తక్కువగా ఉండడమే వ్యత్యాసాన్ని మనం చూస్తూన్నట్టు తెలిపారు. ఆసుపత్రుల్లో చేరాల్సి రావడం, మరణాలను నివారించడమే మన ముందున్న ప్రధాన కర్తవ్యంగా మహమ్మద్ పేర్కొన్నారు. ఎక్కువ వ్యాప్తి చెందే ఒమిక్రాన్ తో వారాల వ్యవధిలోనే భారీ కేసులు రావచ్చని, అప్పుడు వైద్య సదుపాయాలు రిస్క్‌లో పడతాయని హెచ్చరించారు.