యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ తరపున పోటీ చేయడానికి ప్రాథమిక అభ్యర్థుల జాబితాలో తెలంగాణకు చెందిన ఉదయ్ నాగరాజు ఎంపికయ్యారు. యూకేలో లేబర్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితా ఎంపికపై అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. దీని కోసం ఫ్యూచర్ క్యాండిట్స్ పేరుతో రెండు సంత్సరాల ముందు నుంచే వివిధ రకాల వడపోతల ద్వారా ఎంపిక చేస్తారు. ప్రజలకు సేవ చేయడానికి అవసరమైన విద్య, సేవా గుణం, సామాజిక సేవ చేసిన వివరాలు, ప్రజా సమస్యలపై స్పందించే గుణం, వాటిపై అవగాహన ఇలా అనేక ఇతర అంశాలపై పోటీ పరీక్షలు నిర్వహించి వారిని ఎంపిక చేస్తారు. ఇలా ఎంపిక చేసిన వారిలో మొదటి వ్యక్తిగా నాగరాజు నిలిచారు. యూకే లేబర్ పార్టీ అధ్యక్షుడు కిర్ స్టార్మర్ నాయకత్వంలో నాగరాజు ఎన్నికలను ఎదుర్కోనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్ నాగరాజు వరంగల్‌లో పాఠశాల విద్యను అభ్యసించి, మహారాష్ట్ర రాంటెక్‌లోని కిట్స్ కాలేజీలో ఎంటెక్ పూర్తి చేశారు. లండన్‌లో ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ ఆక్స్‌ఫర్డ్ బ్రూక్స్‌లో ఎంఎస్ పూర్తి చేశారు. ప్రస్తుతం యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ లండన్‌లో పరిపాలన శాస్త్రంలో పీజీ చేస్తున్నారు. నాగరాజు ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుల సమీపబంధువు.