టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ తన ఉద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు సంబంధించిన నియమావళి విషయాల్లో మిగతా కంపెనీలకు మార్గదర్శిగా ఉండే ఈ సంస్థ తమ ఉద్యోగులకు ఇచ్చే పేరెంటల్ లీవ్‌ను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఉద్యోగుల శ్రేయస్సు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు గూగుల్ ప్రకటించింది. ఇప్పటి వరకు ఉద్యోగులకు పేరెంట్ లీవ్ కింద 12 వారాల సెలవులు లభించేవి. వీటిని 18 వారాలకు పెంచుతున్నట్లు గూగుల్ ప్రకటించింది. అంతేకాదు బిడ్డలకు జన్మనిచ్చిన తల్లులకు ఇంతకు ముందు 18 వారాలు సెలువులు ఇచ్చేది సంస్థ. ఇప్పుడు ఈ సెలవులను 24 వారాలకు పెంచుతున్నట్లు వెల్లడిరచింది. ఈ లెక్కన అక్కడ మహిళా ఉద్యోగులు ఆరు నెలల పాటు సెలవులు తీసుకోవచ్చు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరికీ ఈ తాజా నిబంధనలు అమలవనున్నాయి. ఉద్యోగుల మంచి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్ తెలిపింది. కంపెనీ తన ఉద్యోగులకు 15 రోజుల పెయిడ్ వెకేషన్ ఇచ్చేది. వీటిని 20 రోజులకు పెంచింది. వచ్చే ఏప్రిల్ 2 నుంచి ఈ కొత్త మార్గదర్శకాలు అమలవుతాయని పేర్కొంది. అమెరికాలో ఇతర సంస్థల కంటే గూగుల్ 24 వారాలకు పేరంటల్ లీవ్‌ను పెంచి అని సంస్థల కంటే ముందుంది. మైక్రో సాఫ్ట్ 22 వారాలు, అమెజాన్ 20 వారాలు, ఉబర్‌లో 18 వారాలు, మెటాలో 17 వారాలు మాత్రమే సెలవును మంజూరు చేస్తున్నాయి.