మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ఖిలాడి.డిరపుల్ హయాతి, మీనాక్షిచౌదరి నాయకిలుగా నటించారు. రమేష్ వర్మ దర్శకుడు. కోనేరు సత్యనారాయణ నిర్మాత. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. రవితేజ మాట్లాడుతూ మీలో ఒకడిగా ఈ సినిమాను ఎంజాయ్ చేశా. నాకు నచ్చింది కాబట్టి తప్పకుండా మీ అందరికి నచ్చుతుందని భావిస్తున్నా. నేను అదృష్టం, జాతకం కంటే కష్టాన్ని నమ్ముకుంటా అన్నారు. అనంతరం నిర్మాత మాట్లాడుతూ ఈ టైటిల్ రవితేజకు పక్కా సరిపోయింది. ఇది పాన్ ఇండియా మూవీ. బాలీవుడ్లో కూడా విడుదల చేస్తున్నాం. దేవిశ్రీప్రసాద్ సంగీతం సినిమాకు ప్రధానాకర్షణగా నిలిచింది. వందరూపాయల టికెట్ కొంటే ఐదొందల రూపాయల విలువను ప్రేక్షకులకు అందించే చిత్రమిది. ఈ సినిమా తీసినందుకు నిర్మాతగా గర్వపడుతున్నా అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ కథలో కొత్తదనం ఉంది కాబట్టే రవితేజ సినిమాకు ఒప్పుకున్నారు. దేవిశ్రీప్రసాద్‌కు ఈ కథ చెప్పినప్పుడు కొన్ని సలహాలిచ్చారు. అన్ని విభాగాల్లో సినిమా అద్భుతంగా కుదిరింది అని తెలిపారు. దర్శకుడు కథ చెప్పినప్పుడే కొన్ని బాణీలు అనుకోకుండా వచ్చేశాయని, సినిమా హాలీవుడ్ స్థాయిలో ఉంటుందని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించారు.ఈ చిత్రం ఫిబ్రవరి 11న విడుదల కాబోతోంది.