ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. బద్వేలు జిల్లాలో దాదాపు 400 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. భవిష్యత్తులో అత్యున్నత నగరాల్లో కడప జిల్లా నిలిచేట్లుగా అభివృద్ధి చేస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు. 80 కోట్లతో లోయర్ సగిలేరు కాల్వల విస్తరణ పనులు, 56 కోట్లతో తెలుగు గంగ పెండింగ్ పనులను పూర్తి చేయడం, 36 కోట్లతో బ్రహ్మ సాగర్ ఎడమ కాల్వలో ఎత్తిపోతల ఏర్పాటు చేయడంతో పాటు 7 కోట్లతో గోదాముల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా బద్వేలులో జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ… కడప తన సొంత జిల్లా అని, అభివృద్ధి పనులు ఎంత చేసినా తక్కువేనని జగన్ పేర్కొన్నారు. అతి త్వరలోనే కడప జిల్లాలో వైఎస్సార్ క్యాన్సర్ ఆస్పత్రికి శంకుస్థాపన చేస్తానని ప్రకటించారు. గత పాలకులు ఎప్పుడూ బద్వేలును పట్టించుకున్న పాపాన పోలేదని, దివంగత సీఎం వైఎస్సార్ పట్టించుకున్నారని, ఆ తర్వాత ఎవరూ పట్టించుకోలేదని విమర్శించారు. బద్వేలులో కూరగాయల మార్కెట్లు, చేపల మార్కెట్లు, వాణిజ్య సముదాయాలతో పాటు లోయర్ సగిలేరు కాల్వల విస్తర పనులు కూడా చేపడతామని ప్రకటించారు.