సినీ నటుడు, విశ్లేషకుడు కత్తి మహేశ్ కన్నుమూశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తల, శరీరంపై తీవ్ర గాయాలు అవడంతో వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. ఆయన కోలుకుంటున్నారని, వైద్యులు కూడా చెప్పారు. కత్తి మహేష్ వెళ్తున్న ఇన్నోవా కారును లారీ వెనకనుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. అయితే, కత్తి మహేశ్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. గత నెల 26న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద జాతీయ రహదారిపై కత్తి మహేశ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా తల, కంటి భాగాల్లో గాయాలవడంతో శస్త్రచికిత్స కూడా చేశారు. మహేశ్ వైద్యానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.17 లక్షల ఆర్థిక సాయాన్ని కూడా అందించింది. అయినా కూడా కత్తి మహేశ్ ప్రాణాలు దక్కలేదు.
కత్తి మహేశ్ చిత్తూరు జిల్లాలో జన్మించారు. అక్కడే ప్రాథమిక విద్యను పూర్తి చేసిన ఆయన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. సినీ దర్శకుడు అవ్వాలన్న ఉద్దేశంతో పలు ప్రయత్నాలు చేశారు. సినీ విమర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన సినిమాల్లో ఆర్టిస్ట్‌గా నటించారు. మిణుగురులు చిత్రానికి కో రైటర్‌గా పని చేసిన ఆయన హృదయ కాలేయం చిత్రంలో పోలీస్‌గా, నేనే రాజు నేనే మంత్రి, క్రాక్ వంటి చిత్రాల్లో మంచి పాత్రల్లో నటించారు. పెసరట్టు చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ చిత్రం సరిగ్గా ఆడకపోవడంతో విమర్శల పాలయ్యారు. కత్తి మహేశ్ దర్శకుడు, నటుడు మాత్రమే కాదు, సినీ విశ్లేషకుడు కూడా. పలు టెలివిజన్ ఛానళ్లు, యూట్యూబ్ వేదికగా విశ్లేషించారు. ఆయన మృతి పట్ల తెలుగు సినీ పరిశ్రమ విచారం వ్యక్తం చేసింది.