రష్యా బలగాలను నిలువరించేందుకు యుద్ధంలో తీవ్రమైన ప్రతిఘటన ఇచ్చేందుకు తమకు మరింత రక్షణ సహాయం కావాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెల్‌న్‌స్కీ మరోసారి అమెరికాను కోరారు. యుద్ధ విమానాలను అందించాలంటూ తాజాగా అమెరికా చట్టసభలకు విజ్ఞప్తి చేశారు. రష్యా చమురు దిగుమతులపై కూడా ఆంక్షలను కఠినతరం చేయాలని కోరారు. అమెరికా చట్ట సభ్యులతో వీడియో కాల్‌లో మాట్లాడిన ఆయన తనను సజీవంగా చూడడం ఇదే చివరిసారి కావచ్చని వ్యాఖ్యానించారు. ఇవే తన చివరి మాటలు కావొచ్చంటూ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. 300 మంది అమెరికా చట్టసభ సభ్యులతో జెల్‌న్‌స్కీ దాదాపు గంటపాలు సంభాషించారు. తాను రాజధాని కీవ్‌లోనే ఉన్నానని స్పష్టం చేశారు.
తమకు మనవతా సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచ దేశాలన్నీ రష్యా చమురు కొనకుండా చూడాలన్నారు. రష్యాకు వ్యతిరేకంగా నో ప్లై జోన్ విధించాలని మరోసారి నాటోతో పాటు సభ్య దేశాలను ఆయన కోరారు. అనంతరం ఉక్రెయిన్ ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. స్వాతంత్య్రం కోసం ఉక్రెయిన్ పౌరులు పోరాడుతూనే ఉంటారని, రష్యా దళాలను ఎదుర్కోవాలని, పోరాటం ఆపవద్దని ప్రజలకు సూచించారు. ఉక్రెయిన్‌లోని ప్రతి అంగుళాన్ని కాపాడుకుంటామని ఆయన తేల్చి చెప్పారు.