అమెరికాలో ఘోరం జరిగింది. భారత యువకుడిని ఓ దుండగుడు తుపాకీతో కాల్చి చంపాడు. టెక్సాస్‌లోని హూస్టన్‌లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. గోవాకు చెందిన జాన్ దియాస్(27) అనే యువకుడిని అతడు పనిచేసే చోటనే దుండగుడు హత్య చేశారు. హూస్టన్‌లో ఓ గ్యాస్ స్టేషన్లో స్టోర్ క్లర్క్‌గా పని చేస్తున్నాడు. ప్రతిరోజులానే డ్యూటీకి వెళ్లాడు. దియాస్ కౌంటర్‌పై ఉండగా అక్కడికి ఓ దుండగుడు వచ్చాడు. అప్పటికే కౌంటర్ వద్ద కొంతమంది కస్టమర్లు ఉండడంతో కొద్దిసేపు వేచి చూశాడు. కస్టమర్లు అందరూ వెళ్లిపోయిన తర్వాత తుపాకీ గురిపెట్టి కౌంటర్లో నగదు మొత్తం తీసి ఇవ్వాలని దియాస్‌ను బెదిరించాడు. కానీ దియాస్ డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. చాలా దగ్గరి నుంచి పాయింట్ బ్లాంక్‌లో కాల్చడంతో దియాస్ అక్కడికక్కడే కుప్పకూలాడు. అనంతరం దుండగుడు కౌంటర్లోని నగదు తీసుకుని పరారయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వాటి ఆధారంగా పరారీలో ఉన్న దుండగుడి కోసం హూస్టన్ పోలీసులు గాలిస్తున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/modi-300x160.jpg)