తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మన ఊరు మన బడి పథకంపై ఎన్‌ఆర్‌ఐలతో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ముఖాముఖి నిర్వహించారు. అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్ కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ మీట్ అండ్ గ్రీట్ విత్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ అభివృద్ధిలో మీ అందరి భాగస్వామ్యం ఉండాలి. మీకు మించిన బ్రాండ్ అంబాసిడర్స్ ఎవరూ ఉండరు. తెలంగాణ గురించి మీరే గొప్పగా ప్రచారం చేయగలరు. అభివృద్ధిలో ముందంజలో ఉన్నామన్నారు. విద్యావ్యవస్థను పటిష్టం చేస్తున్నాం. మనం చదువుకున్న పాఠశాల అభివృద్ధికి తమ వంతుగా సహాయం చేయాలన్నారు. గుడులు కట్టించే వారు గుడులను కట్టించండి. బడులు కట్టించే వారు బడులు కట్టించండి. లైబ్రరీలు కట్టించే వారు లైబ్రరీలు కట్టించండి దీని వల్ల స్థానికుల నుంచి వచ్చే కృతజ్ఞత మరిచిపోలేనిదిగా ఉంటుందన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కంటే ముందు తెలంగాణలో కేవలం మూడు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు. అలా వైద్య విద్యతో పాటు స్కూల్ ఎడ్యుకేషన్ పటిష్టం చేస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు.