ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న దండయాత్ర నెల రోజులు పూర్తి చేసుకుంది. ఉక్రెయిన్ భూభాగం శవాల దిబ్బగా మారిపోతోంది. అయినా రష్యా మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పలు దఫాలుగా చర్చలు జరిపినా విజయవంతం కాలేదు. పుతిన్ దూకుడు పెంచుతూ ఉక్రెయిన్‌పై విరుచుకుపుడుతున్నాడు. ఎప్పుడు చర్చలు సఫలం అవుతాయి.. ఎప్పుడు ఈ యుద్ధం ముగుస్తుందో అని ప్రతీ ఒక్కరు వేచి చూస్తున్నారు. అయితే పుతిన్ నుంచి వచ్చిన కొన్ని సంకేతాలు యుద్ధం ముగింపు తేదీని తెలియజేస్తున్నాయి. ఉక్రెయిన్‌తో వార్ కారణంగా రష్యా కూడా భారీగా ఆయుధ సామాగ్రి, సైనికులను కోల్పోతున్నది. దీన్ని గ్రహించిన పుతిన్ మే 9నాటికి యుద్దానికి ముగింపు పలకాలని భావిస్తున్నట్టు సమాచారం. దీనికి తగిన విధంగా రష్యా ఆర్మీ సన్నాహాలు కూడా చేస్తున్నట్టు సమాచారం.
మే 9న యుద్దాన్ని ముగించే అవకాశం ఉన్నట్టు ఉక్రెయిన్ ఆర్మీ కూడా అంచనా వేస్తోంది. నాజీ జర్మనీపై విజయం సాధించిన రోజుగా రష్యాలో మే 9న విజయోత్సవ్ జరుపుకుంటారు. ఆ రోజు నాటికి యుద్ధం ముగించాలని రష్యన్ బలగాలకు పుతిన్ నుంచి ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తున్నది. ఈ లోగా లక్ష్యం పూర్తి చేయాలని తన సైన్యానికి ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఇప్పటికే ఉక్రెయిన్ పంపిన సైన్యంలో 15 వేల మందికి పైగా సైనికులు చనిపోయారు. ఉక్రెయిన్ దెబ్బలు పైకి కనిపిస్తుంటే రష్యాకు తగిలిన దెబ్బలు మాత్రం లోలోపల కుమిలిపోయేలా ఉన్నాయి. దీంతో రష్యా, ఉక్రెయిన్ యుద్దానికి ముగింపు పలకాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి.