ఇస్తాంబుల్ నగరంలో రష్యా, ఉక్రెయిన్ మధ్య జరిగిన శాంతి చర్చలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందించారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో రాజీ ప్రయత్నాలు ఫలిస్తున్న సంకేతాలు వస్తున్నప్పటికీ, శత్రు దేశాన్ని పూర్తిగా విశ్వసించలేమని జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చర్చల ఫలితం సానుకూలంగానే ఉందని అన్నారు. అయితే రష్యాను తాము ఇప్పుడే నమ్మలేమని, తమ ప్రజలేమీ అంత మాయకులు కారని ఆయన స్పష్టం చేశారు. చర్చలకు సంబంధించిన ఫలితాలు చేతల్లో పూర్తిగా అమలైనప్పుడే నమ్ముతామని అన్నారు. ఉక్రెయిన్ సైనికుల ధైర్య సాహసాల వల్లే రష్యా సైన్యం వెనుక్క తగ్గుతోందని, అయినా, ఆ దేశాన్ని తాము నమ్మేది లేదని అన్నారు. పరిస్థితులు ఇంకా మెరుగుపడ లేదని, ప్రజలెవరూ నిర్లక్ష్యంగా ఉండొద్దని సూచించారు. దేశంపై రష్యా ఇంకా దాడులు కొనసాగించే అవకాశం ఉందని తెలిపారు. రాజధానీ కీవ్, ఉత్తర ప్రాంత నగరం చెర్నిహైవ్ సమీపంలో సైనిక కార్యకలాపాలను తగ్గించుకునేందుకు రష్యా అంగీకరించినట్లు తెలిసింది. అయితే ఇది పూర్తిగా ఉక్రెయిన్ సైనికుల వల్లే సాధ్యపడిరది. వారి దైర్యవంతమైన చర్యల వల్లే రష్యా వెనక్కి తగ్గింది.